madanapalle-tomato-auction

ప్రభుత్వం తరఫున 30 టన్నుల టమోటా కొనుగోలు: రీజనల్ జాయింట్ డైరెక్టర్ రామాంజులు

మదనపల్లె, జూలై 28: (gtvmedia)మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో మంగళవారం నిర్వహించిన టమోటా వేలంపాటలను అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) రామాంజులు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యకలాపాలను సమీక్షించి అధికారులు, వ్యాపారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆర్‌జేడీ రామాంజులు మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున మదనపల్లె మార్కెట్ యార్డులో 30 టన్నుల టమోటాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం సుమారు 1,000 టన్నుల టమోటా రాగా, మొదటి రకం 15 కిలోల బాక్స్ గరిష్ఠంగా రూ.200 ధర పలికిందన్నారు. పలు మండీలలో అదే రకం టమోటా రూ.180 వరకు విక్రయించబడిందని తెలిపారు.

తక్కువ నాణ్యత గల టమోటా అధికంగా మార్కెట్‌కు రావడంతో కనిష్ట ధర కిలోకు రూ.7 వరకు నమోదైందని చెప్పారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం తక్కువ నాణ్యత గల టమోటాను కిలోకు రూ.8 నుంచి రూ.11 వరకు ధరకు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు ధర ప్రకారం అర్హత కలిగిన టమోటాకు కిలోకు గరిష్ఠంగా రూ.11 చెల్లిస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వం కొనుగోలు చేసిన టమోటాలను విశాఖపట్నం, మచిలీపట్నంలోని రైతు బజార్లకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ జంగాల శివరామ్, మార్కెట్ సెక్రటరీ త్యాగరాజు, సహాయ కార్యదర్శి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *