వృద్ధురాలి హత్యపై భగ్గుమన్న బంధువులు.. జాతీయ రహదారిపై రాస్తారోకో

బంగారు నగల కోసం 83 ఏళ్ల లక్ష్మీదేవిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్.. డీఎస్పీ బుచ్చిరాజు హామీతో ఆందోళన విరమణ

మదనపల్లె: సెప్టెంబర్ 5 బంగారు నగల కోసం వృద్ధురాలు లక్ష్మీదేవి (83)ని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం సాయంత్రం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మదనపల్లె బైపాస్ రోడ్డులోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ.. చిల్లర దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నిస్సహాయ వృద్ధురాలిని నమ్మించి, ఫంక్షన్‌కు తీసుకెళ్తామనే పేరుతో తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు నగలను దోచుకున్న నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని డిమాండ్ చేశారు.

ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణకు తీసుకెళ్లి నిందితులకు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడేలా చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు నినదించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రహదారిపై కొంతసేపు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ

విషయం తెలుసుకున్న డీఎస్పీ బుచ్చిరాజు వెంటనే పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

కేసులో పటిష్టమైన ఆధారాలను సేకరించి, సమగ్రంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. నిందితులకు చట్టప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీసుల హామీతో సంతృప్తి చెందిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాను విరమించారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *