రూ.13 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం
కల్లూరు: సెప్టెంబర్ 5 కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.13 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 106 రామిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన ఎం. శంకర్‌రెడ్డి ఇంట్లో మే 15న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి 8 గ్రాముల బంగారు గొలుసు, రూ.20 వేల నగదు అపహరించారు. దీనిపై కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా చిత్తూరు ఫింగర్‌ప్రింట్స్ బ్యూరో సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన వేలిముద్రలను విశ్లేషించగా అవి రొంపిచెర్ల మండలం దద్దాలవారిపల్లికి చెందిన ఆవులకుంట నరేష్ వేలిముద్రలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు శనివారం సాయంత్రం పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద నరేష్‌తో పాటు అతనికి సహకరించిన పిన్న బోయున శ్రీనివాసులును అరెస్టు చేశారు.
పలు ప్రాంతాల్లో దొంగతనాలు
విచారణలో నరేష్ 2025లో కొత్తపేటలోని అబ్దుల్ మునాఫ్ ఇంటితో పాటు, కల్లూరు–పులిచెర్ల రహదారిలో వగాళ్లవారిపల్లి సమీపంలోని ఎల్లమ్మ ఆలయం, 106 రామిరెడ్డిగారిపల్లి, బలిజిపల్లిలో ఏకాంబరం ఇంట్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా పీలేరు, చంద్రగిరి మండలాల్లోని పలు ఆలయాల్లోనూ దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దొంగసొత్తు విక్రయానికి సహకారం
నరేష్ దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను వివిధ బంగారు నగల దుకాణాల్లో విక్రయించేందుకు శ్రీనివాసులు సహకరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి రూ.2.42 లక్షల నగదు, 78 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని, వీటి మొత్తం విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడీ ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో, కల్లూరు సీఐ ఎం. జయరామయ్య పర్యవేక్షణలో ఎస్ఐ యు. వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.
