మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లెలో భారీ ధర్నా, ర్యాలీ
విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం: YSRCP నేతల ఆగ్రహం
అన్నమయ్య జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ

మదనపల్లె, జూలై 28: (gtvmedia)డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం మదనపల్లెలో మహాధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పాల్గొన్నారు. మిషన్ కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై స్వతంత్రంగా సీబీఐతో విచారణ జరిపించాలని కోరడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన వంటి పథకాలను సకాలంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నిర్వహణలో విఫలమయ్యారని, బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని అన్నారు.
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమయానికి పాఠ్యపుస్తకాలు అందడం లేదని, విద్యా సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత ఉందని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పా రెడ్డి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు.
వైఎస్సార్సీపీ పరిశీలకురాలు అనీషా రెడ్డి మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
