ఘనంగా రవీంద్ర పదవీ విరమణ సన్మాన కార్యక్రమం
మదనపల్లె, ఆగస్టు 9:( gtvmedia)పి.ఎం.శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన రవీంద్ర అందించిన సేవలు అభినందనీయమని విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం. గీత అన్నారు. ఆదివారం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ సమావేశ మందిరంలో రవీంద్ర పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గీత మాట్లాడుతూ రవీంద్ర 1992 నుంచి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని నవోదయ విద్యాలయాల్లో సుమారు 35 సంవత్సరాల పాటు సేవలు అందించారని తెలిపారు. విద్యార్థుల్లో చిత్రకళా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు విద్యాలయాల్లో నిర్వహించే కళా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.
విద్యార్థులను కళారంగంలో ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను వెలికితీయడంలో రవీంద్ర కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
రవీంద్ర సేవలను కొనియాడిన సహచరులు
అనంతరం విద్యాలయ సీనియర్ ఉపాధ్యాయులు శారద, జగదీష్ కుమార్, శ్రీనివాసమూర్తి తదితరులు రవీంద్ర సేవలను కొనియాడారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్, విశ్రాంత ప్రిన్సిపాల్ జి. శేఖర్, కంప్యూటర్ టీచర్ లక్ష్మీనారాయణ, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చెన్నయ్య, డాక్టర్ మోహనవల్లి, పూర్వ విద్యార్థులు జేఎన్వీ జనార్దన్, సీఐ అశోక్ కుమార్, ధనంజయ్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
