మదనపల్లె, జూలై 29: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి ఎంపికల పోటీలను మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువతలోని క్రీడా ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఛాంపియన్‌షిప్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (DSDO) జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను పారదర్శకంగా ఎంపిక చేసి తదుపరి స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
నిర్వాహకులు మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, అన్సార్ బాషా, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
