జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలి– దస్తావేజుల సేవల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

మదనపల్లె, జూలై 29:( gtvmedia)
ప్రజలకు పారదర్శకంగా, చట్టబద్ధంగా ప్రభుత్వ కార్యాలయాల ద్వారా అందాల్సిన దస్తావేజుల నమోదు సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు.

బుధవారం దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ ‌కార్యక్రమానికి కృష్ణప్ప, సాంబశివ సంఘీభావం తెలిపారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరణ చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. దస్తావేజుల నమోదు వంటి కీలక ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, సేవల పారదర్శకత, జవాబుదారీతనం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.

ప్రభుత్వ శాఖలను ఆధునీకరించి మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో వాటిని బలహీనపరిచే విధానాలను అమలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ సేవలు ప్రభుత్వ అధికారుల ద్వారానే నిర్వహించబడాలని, ప్రజల హక్కులను కార్పొరేట్ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరారు.

ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో పాటు, ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, సాధారణ ప్రజలు అధిక ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా సేవలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, జీవో నెం. 396ను వెంటనే ఉపసంహరించుకుని దస్తావేజుల సేవలను పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ప్రజా సేవలు ప్రజల కోసమే ఉండాలి – ప్రైవేటు లాభాల కోసం కాదు” అని తోపు కృష్ణప్ప, సాంబశివ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *