జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మదనపల్లె, ఆగస్టు 15: (gtvmedia)
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలోని మైదానంలో తిరంగా పండుగను ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.

రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వేదికపైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ప్రజలు గౌరవంగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది శకటాలతో నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ, వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను మంత్రి, అధికారులు సందర్శించి తిలకించారు. చివరగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక నృత్యాలు, కళా ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ముగిశాయి.
