వెలిగల్లు ప్రాజెక్టు కుడికాలువకు నీటి విడుదల
తాగునీరు, పశువుల అవసరాలే ప్రథమ ప్రాధాన్యత – నీటిని పొదుపుగా వినియోగించాలి
ప్రాజెక్టు నీటిని నమ్ముకుని పంటలు వేయొద్దు.. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
గాలివీడు, సెప్టెంబర్ 06:
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువకు ఆదివారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 15 రోజుల అనంతరం 80 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు.
నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ కాలువలు, చెరువుల ద్వారా దిగువ ప్రాంతాలకు అవసరమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువల నిర్వహణ, నీటి ప్రవాహం, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కడప ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ బాలచంద్రారెడ్డి, వెలిగల్లు ప్రాజెక్టు ఈఈ భరత్ కుమార్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
