అన్నమయ్య జిల్లా నుంచి వంద మందికి పైగా నాయకుల హాజరు
మదనపల్లె, సెప్టెంబర్ 1: gtvmedia
‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన ‘ఛలో ఢిల్లీ’ పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి వంద మందికి పైగా సీపీఐ నాయకులు ఢిల్లీ చేరుకుని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పీ. మహేష్ మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కడప–లక్కిరెడ్డిపల్లె–రాయచోటి–గుర్రంకొండ–మదనపల్లె మీదుగా బెంగళూరుకు పాత అలైన్‌మెంట్ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రైల్వే మార్గం ఏర్పడితే రైతులకు తమ పంటలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహేష్ అన్నారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించిన నిధులను కేంద్రం భరించాలని, ఉపాధి హామీ పథకం పేరుమార్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టీ. కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. మురళీ, శ్రీనివాసులు, సుమిత్రమ్మ, టి.ఎల్. వెంకటేష్ తదితరులతో పాటు ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు.
