నెక్స్టెరా వరల్డ్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. మాధవ్

మదనపల్లె, ఆగస్టు 19: మదనపల్లె పట్టణంలోని సీటీఎం రోడ్, బాపూజీ పార్క్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ భవనంలో నెక్స్టెరా వరల్డ్ (OPC) ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్నట్లు చెబుతున్న కార్యకలాపాలపై ప్రభుత్వం, పోలీసులు, సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె. మాధవ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై ఇప్పటికే సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేశామని, పలుమార్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

రూ.45,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు

యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఉద్యోగం, వ్యాపారం, డీలర్‌షిప్, ఐడీ కార్డు, ఆదాయ అవకాశాల పేరుతో ఆకర్షించి ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.45,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని మాధవ్ పేర్కొన్నారు.

ఈ డబ్బులు ఏ పేరుతో వసూలు చేస్తున్నారు? ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి? చెల్లింపులకు రసీదులు, ఇన్వాయిస్‌లు జారీ చేస్తున్నారా? వంటి అంశాలపై అధికారులు బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలను పూర్తిగా పరిశీలించాలని కోరారు.

అలాగే కొత్త సభ్యులను చేర్చినందుకు కమిషన్లు చెల్లిస్తున్నారా? కంపెనీకి ఆదాయం వాస్తవ ఉత్పత్తుల విక్రయాల ద్వారా వస్తుందా, లేక కొత్త సభ్యులను చేర్చడం ద్వారా వస్తుందా? అనే అంశాలపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు ఉద్యోగం లేదా నిర్ధిష్ట ఆదాయం కల్పిస్తామని హామీలు ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు తేలితే, వాట్సాప్ సందేశాలు, వీడియోలు, ప్రచార పత్రాలు, చెల్లింపు వివరాలు తదితర ఆధారాలను సేకరించి విచారణలో భాగంగా పరిశీలించాలని మాధవ్ కోరారు.

ఆరోపణలు నిజమా కాదా తేల్చాలి

నెక్స్టెరా వరల్డ్ కార్యకలాపాలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి తేల్చాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఉన్నట్లు విచారణలో తేలితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి సాయి, గర్ల్స్ కో-కన్వీనర్ నవ్య, నాయకులు తరుణ్, అమృత, బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *