మదనపల్లె, సెప్టెంబర్ 3: రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గురువారం మదనపల్లెలో స్థానిక విలేకరులతో సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. మదనపల్లె మండలం కోటవారిపల్లి గ్రామం గూటంవారిపల్లికి చెందిన 28 ఏళ్ల యువ రైతు జయసింహ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, పెరిగిన అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విచారకరమని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం, పంట దిగుబడులు తగ్గిపోవడం, మరోవైపు టమాటాకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర లభించకపోవడం ఆందోళనకరమన్నారు.
గతంలో టమాటా హబ్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఐటీ కారిడార్లు, అంతర్జాతీయ హబ్‌ల పేరుతో ప్రభుత్వం అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలపై తగిన దృష్టి సారించడం లేదని ఆరోపించారు.
పంటల బీమా విధానంలో మార్పులు చేసి రైతులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. గతంలో తక్కువ మొత్తంతో అందుబాటులో ఉన్న పంట బీమాకు ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని, పంట నష్టపోయిన రైతులకు మాత్రం తగిన బీమా పరిహారం అందడం లేదని ఆరోపించారు. ప్రస్తుత బీమా విధానం రైతుల కంటే బీమా సంస్థలకే ప్రయోజనం చేకూర్చేలా ఉందని దుయ్యబట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల కారణంగానే రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించే బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.
ఆత్మహత్యకు పాల్పడిన రైతు జయసింహ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రస్తుత పరిస్థితులు, పెరిగిన జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
