మదనపల్లెలో ఘనంగా యూటీఎఫ్ ఉచిత టెట్ శిక్షణ ముగింపు సభ

ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయం: డీఈఓ డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం

మదనపల్లె, ఆగస్టు 2: యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నెల రోజులపాటు నిర్వహించిన ఉచిత టెట్ (TET) శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా మదనపల్లెలోని హోప్ ఎయిడెడ్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ముగింపు సభకు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సభలో డీఈఓ మాట్లాడుతూ, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన టెట్ శిక్షణ అందించడం యూటీఎఫ్ చేపట్టిన ప్రశంసనీయ కార్యక్రమమని అన్నారు. ఈ శిక్షణ ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, టెట్ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

మదనపల్లె మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రాజగోపాల్ మాట్లాడుతూ, విద్యా సంబంధిత ప్రతి కార్యక్రమంలో యూటీఎఫ్ చురుకైన సహకారం అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్మెంట్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సంఘం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కె. హేమలత మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అలాగే ఉచిత టెట్ శిక్షణ నిర్వహణకు సహకరించిన హోప్ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం శిక్షణలో వివిధ పాఠ్యాంశాలను బోధించిన రిసోర్స్ పర్సన్స్ అబ్దుల్ రెహమాన్, విజయకుమార్, సిద్ధారెడ్డి, నాగభూషణం నాయుడు, కె. విజయ్ కుమార్, వెంకటేష్, లక్ష్మీపతి, శోభారాణిలను దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు పురం వెంకటరమణ, ఆదినారాయణ, విజయకుమార్, సీనియర్ నాయకులు రాధాకృష్ణ, రమణ, డివిజనల్ కన్వీనర్ ఈ. సుధాకర్, కోర్స్ కన్వీనర్ నాగభూషణం నాయుడు, మండల నాయకులు విజయకుమార్, శ్రీనివాసులు, శ్రీధర్, రాధామణి, జరీనా బేగం, పైని, శ్రీధర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *