అన్నమయ్య జిల్లాలో ‘మై భారత్’ పోర్టల్ నమోదును విస్తృతం చేయాలి: ఇన్‌చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ

యువతకు ప్రభుత్వ అవకాశాలు చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం

మదనపల్లి, ఆగస్టు 3:( gtvmedia)
అన్నమయ్య జిల్లాలో అర్హులైన ప్రతి యువకుడు, యువతిని మై భారత్పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి యువతకు అందుబాటులో ఉన్న అవకాశాలను చేరవేయాలని సూచించారు.

సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ‘మై భారత్ కేంద్రం–యువ’ జిల్లా సలహా మండలి (District Advisory Committee) సమావేశానికి ఇన్‌చార్జి కలెక్టర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మై భారత్ పోర్టల్ కీలక వేదికగా నిలుస్తోందన్నారు. ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం, జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు యువతకు లభిస్తాయని తెలిపారు.

జిల్లాలో కొనసాగుతున్న నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్య, యువజన, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి యువతిని పోర్టల్‌లో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్ మాట్లాడుతూ, మై భారత్ పోర్టల్ ద్వారా స్వచ్ఛంద సేవా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, నాయకత్వ వికాస కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, జాతీయ స్థాయి యువజన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ వెంకటేష్, కెఆర్‌సీసీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సలహా మండలి సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

(సమాచారం: డీఐపీఆర్వో, అన్నమయ్య జిల్లా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *