హైదరాబాద్: (gtvmedia)హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఉచిత హార్ట్ సర్జరీలు ప్రారంభం కానున్నాయి.
ముందుగా వాక్-ఇన్ విధానంలో చిన్నారులను వైద్యులు పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
చిన్నారుల తల్లిదండ్రులు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలతో నిమ్స్ పాత బ్లాక్‌కు నేరుగా రావచ్చని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. అర్హులైన చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
