మదనపల్లె, సెప్టెంబర్ 18:
నేర దర్యాప్తును మరింత పటిష్టం చేసేందుకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. డీజీపీ మంజూరు చేసిన ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం మదనపల్లెలో ప్రారంభించి క్లూస్ టీమ్ ఇన్‌ఛార్జి సునీల్‌కు అప్పగించారు.
ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో 10 రకాల ప్రత్యేక కిట్లు, హై-ఇంటెన్సిటీ లైట్లు, డీఎన్ఏ సంబంధిత పరికరాలు అందుబాటులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించడం, భద్రపరచడం, శాస్త్రీయంగా విశ్లేషించేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది.
ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. నేరస్తులు సాక్ష్యాలను మాయం చేసినప్పటికీ శాస్త్రీయ దర్యాప్తు ద్వారా ఆధారాలను గుర్తించి, నేరం రుజువయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
