మదనపల్లె, సెప్టెంబర్ 18: మదనపల్లి నియోజకవర్గ స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) సమీక్ష సమావేశం నిర్వహించారు. మదనపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా మదనపల్లి, రామసముద్రం, నిమ్మనపల్లి మండలాలకు సంబంధించిన వివిధ శాఖల KPI స్కోర్లు, గ్రేడ్లు, పనితీరును శాఖల వారీగా ఎమ్మెల్యే సమీక్షించారు. తక్కువ స్కోర్లు, గ్రేడ్లు నమోదైన శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
తదుపరి KPI సమీక్ష నాటికి స్కోర్లను గణనీయంగా పెంచి, నిర్దేశిత లక్ష్యాలను 100 శాతం సాధించేలా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి శాఖ A+ గ్రేడ్ సాధించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు.
