రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు ఘన స్వాగతం
రేణిగుంట, సెప్టెంబర్ 11: రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను మదనపల్లి రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రామదాస్ చౌదరి, ఏఎంసీ మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం, బండి మనోహర్, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ, కూటమి శ్రేణుల సమన్వయం, ఎన్నికల కార్యాచరణ తదితర అంశాలపై దేవ వరప్రసాద్‌తో నాయకులు చర్చించినట్లు తెలిపారు.

స్థానిక ఎన్నికలను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దేవ వరప్రసాద్ సూచించినట్లు నాయకులు పేర్కొన్నారు. స్థానిక స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించినట్లు తెలిపారు.
అదే సందర్భంగా తాతంశెట్టి నాగేంద్ర, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా దేవ వరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే కార్యక్రమాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన, కూటమి నాయకుల మధ్య జరుగుతున్న సమావేశాలు, పరస్పర చర్చలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
