వీధి కుక్కల కాటు నివారణపై బి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు

మదనపల్లె, ఆగస్టు 4: (gtvmedia)సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాల నివారణ, రాబీస్ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మదనపల్లెలోని బి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుత్తా గిరిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వీధి కుక్కల సమస్య అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై గౌరవ సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాబీస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న మదనపల్లె పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె. రోహిణి మాట్లాడుతూ, పెంపుడు కుక్కలకు మూడు నెలల వయస్సు వచ్చిన వెంటనే మొదటిసారిగా రాబీస్ టీకా వేయించాలని, అనంతరం ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ చేయించడం తప్పనిసరి అని సూచించారు. జంతువుల లాలాజలంతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించాలని, వీధి కుక్కల్లో రాబీస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. అటువంటి కుక్కలను అధికారులు పట్టుకొని శస్త్రచికిత్స ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేసి, రాబీస్ టీకాలు వేసి తిరిగి వదిలేస్తారని వివరించారు. రాబీస్ వ్యాధికి టీకాను ప్రముఖ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ కనుగొన్నారని తెలిపారు.
అనంతరం స్థానిక వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ఎస్. పావని మాట్లాడుతూ, రాబీస్ వ్యాధి కేవలం కుక్కల ద్వారా మాత్రమే కాకుండా పిల్లులు, కోతులు వంటి ఇతర జంతువుల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. కుక్క లేదా ఇతర జంతువు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, స్వచ్ఛమైన నీటితో బాగా కడిగి, ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రాబీస్ నిరోధక టీకాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీదేవి సభకు హాజరైన అతిథులు, అధ్యాపకులు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. పి. రవీంద్రనాథ్ రెడ్డి సమన్వయం చేశారు. అధ్యాపకులు డా. డి. శ్రీనివాసులు, డా. జి. చిన్నారెడ్డి, టి బాలాజీ, ఎల్.బి. ప్రసాద్, డా. కృష్ణవేణి, డా. ఎస్. గురుప్రసాద్, శ మాధవి తదితర అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *