మదనపల్లె, సెప్టెంబర్ 17:
మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో విద్యార్థులకు జాతీయ స్థాయి గేట్–జామ్ 2027 పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ‘గేట్–జామ్ 2027 ఔట్రీచ్ ప్రోగ్రామ్’ నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రత్న కుమార్ అన్నబట్టుల హాజరై గేట్, జామ్ పరీక్షల ప్రాధాన్యత, ఉన్నత విద్య, పరిశోధన, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
గేట్ స్కోర్ ద్వారా ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు తదితర ప్రముఖ సంస్థల్లో ఎం.టెక్., ఎం.ఇ., పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కార్యక్రమాల్లో ప్రవేశ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అర్హతలను బట్టి ఫెలోషిప్లు, ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయని వివరించారు.

అదేవిధంగా జామ్ పరీక్ష ద్వారా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ తదితర సైన్స్ విభాగాల్లో ఉన్నత విద్య, పరిశోధనకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడంతో పాటు గత ప్రశ్నపత్రాలను విశ్లేషించడం, మాక్ టెస్టులు రాయడం, నాణ్యమైన ఆన్లైన్ లెక్చర్లను వినియోగించుకోవడం, నిరంతరం సాధన చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసిస్టెంట్ డీన్–అకాడెమిక్స్ డాక్టర్ బాలాజీ దామోదర్, కోఆర్డినేటర్ డాక్టర్ వినీత్ కుమార్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
