మదనపల్లె, ఆగస్టు 22:( gtvmedia)మహిళలకు సంపూర్ణ సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు.. అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు విమర్శించారు. మహిళా రక్షణ, భద్రత, సంక్షేమం, సమానత్వం, సాధికారత అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
ఈ మేరకు శనివారం మదనపల్లెలోని కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నాయకులు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ మహిళలకు సమాన హక్కులు, నిర్ణయాధికారంలో తగిన భాగస్వామ్యం పూర్తిస్థాయిలో లభించడం లేదన్నారు.
విద్య, ఉపాధి రంగాల్లో మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పేదరికం కారణంగా మహిళలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందన్నారు. ఆహార, ఆరోగ్య భద్రత లోపించడంతో పేద, సామాన్య కుటుంబాలకు చెందిన మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
మద్యం విక్రయాల కారణంగా పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కారణంగా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో పాటు మహిళలపై హింస కూడా పెరుగుతోందని ఆరోపించారు. ఇంటా బయటా మహిళలపై వివిధ రూపాల్లో హింస కొనసాగుతోందని, అనేక సమస్యలతో మహిళల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.
మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన, విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమానత్వం కోసం ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుని పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని కోరారు.
అనంతరం మహిళా సమాఖ్య నాయకులు కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
