పరిశుభ్రతను జీవితంలో భాగంగా చేసుకోవాలి

— జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

చిన్నమండెం, ఆగస్టు 22: (gtvmedia)పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రస్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం “ఆరోగ్యవంతమైన పాఠశాలలుఆరోగ్యవంతమైన ఆంధ్ర” థీమ్‌తో చేపట్టిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

చిన్నమండెం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం చిన్నమండెంలోని ప్రాథమిక పాఠశాల (ఉర్దూ)ను సందర్శించి పాఠశాల పరిసరాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలించారు.

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిశుభ్రమైన పాఠశాలలు, ఆరోగ్యకరమైన పరిసరాలు విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో కీలకమని తెలిపారు.

అనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని వీధి డ్రెయిన్లతో పాటు హైవే రోడ్డుకు సమీపంలోని పెద్ద కాలువను కలెక్టర్ పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించి, డ్రెయిన్లలో నీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు.

పరిశుభ్రత అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియగా కొనసాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలు, పాఠశాలలు, ప్రధాన రహదారులు, డ్రెయిన్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, చెత్త నుంచి సంపద తయారీకి చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి, ఎమ్మార్వో రామాంజనేయులు, సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *