మదనపల్లె,సెప్టెంబర్ 13:మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నమోదు చేయాలని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీఈవో మధుసూదన్ అధికారులకు సూచించారు.
ఆదివారం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, వాల్మీకిపురం, పీలేరు ఎక్సైజ్ స్టేషన్లను ఎక్సైజ్ ఏసీ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీఈవో మధుసూదన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు అవసరమైన వివరాలను లైసెన్సీదారులకు స్పష్టంగా వివరించాలని అధికారులను ఆదేశించారు.
లైసెన్స్ ఫీజుతో పాటు రెన్యువల్ ఫీజులను కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పర్మిట్ రూమ్‌కు రూ.5 లక్షలు, పెద్ద దుకాణాలకు రూ.7 లక్షల చొప్పున ఫీజులను నాలుగు విడతల్లో చెల్లించుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా లైసెన్స్ ఫీజును కూడా విడతల వారీగా చెల్లించవచ్చని, అయితే రెన్యువల్ ఫీజును మాత్రం ఒకే విడతలో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
జిల్లాలో మొత్తం 124 మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యువల్ చేయించేందుకు అన్ని ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్లను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. రెన్యువల్ ప్రక్రియను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో ఏఈఎస్ జోగేంద్ర, ఎక్సైజ్ సీఐలు భీమలింగ, లత, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
