పీజీఆర్ఎస్ అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె, జూలై 27: (gtvmedia)ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం మదనపల్లెలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.

జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ వెంకటేష్, కెఆర్ఆర్సీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌లలో అందుతున్న అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రీవెన్స్ పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించే అభిప్రాయాల్లో జిల్లాకు సానుకూల పనితీరు నమోదయ్యేలా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో అన్నమయ్య జిల్లాకు మెరుగైన స్థానం తీసుకురావాలంటే ప్రతి శాఖ తన పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల నుంచి అందిన ముఖ్యమైన వినతులు

● వికలాంగుల పెన్షన్ కోసం విజ్ఞప్తి:
మదనపల్లె మండలం రంగారెడ్డి కాలనీకి చెందిన నీళ్ల ఉమామహేశ్వర రోడ్డు ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురై ఉపాధి కోల్పోయానని, కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంటూ వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

● భూ ఆక్రమణపై ఫిర్యాదు:
మదనపల్లె మండలం కొత్తవారిపల్లికి చెందిన అంగజాల చంద్ర తన పేరిట నమోదైన 40 సెంట్ల భూమిని ఇతరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించి న్యాయం చేయాలని కోరారు.

● భూమి మ్యూటేషన్ కోరుతూ వినతి:
వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన జమ్మలమడుగు సరసమ్మ, తమ తల్లి పేరున ఉన్న 3.54 ఎకరాల భూమిని చట్టబద్ధమైన వారసులైన ముగ్గురు కుమార్తెల పేర్లకు మ్యూటేషన్ చేసి పట్టాదారు పాస్‌బుక్‌లు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

310 అర్జీలు స్వీకరణ

ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 310 అర్జీలు అందగా, వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎండార్స్ చేశారు.

కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *