స్థానిక సమరానికి టీడీపీ సన్నద్ధం.. జిల్లాల వారీగా ఎన్నికల ఇన్‌చార్జ్‌ల నియామకం

అన్నమయ్య జిల్లాకు ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు బాధ్యతలు.. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల నిర్వహణ వరకు పర్యవేక్షణ

అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ తరఫున ప్రత్యేక ఇన్‌చార్జ్‌లను నియమించింది.

టీడీపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు అన్నమయ్య జిల్లాకు ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతలను ఇన్‌చార్జ్‌లు పర్యవేక్షించనున్నారు.

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కేవలం స్థానిక ఎమ్మెల్యేలకే పరిమితం చేయకుండా పార్టీ సీనియర్ నేతలకు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్‌చార్జ్‌లు జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకుని ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయనున్నారు.

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మదనపల్లె నియోజకవర్గంలోనూ టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీ క్యాడర్‌ను గ్రామ, వార్డు స్థాయిలో మరింత క్రియాశీలం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందస్తు వ్యూహంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *