ఆటో, మోటార్ రవాణా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

అన్నమయ్య జిల్లా: ఆటో, మోటార్ రవాణా కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ముబారక్ మాట్లాడుతూ.. మోటార్ రవాణా కార్మికుల కోసం చట్టబద్ధమైన సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల ఉచిత ప్రమాద బీమా, పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ-చలాన్ల పేరుతో పోలీసులు, రవాణా శాఖలు టార్గెట్ల విధానంలో భారీగా జరిమానాలు విధిస్తున్నారని ఆరోపిస్తూ, జీవో నంబర్లు 21, 31 కింద విధిస్తున్న అసాధారణ జరిమానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆటో కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటోలను నిలుపుకునేందుకు స్థానికంగా ప్రత్యేక స్థలాలను కేటాయించాలని కోరారు.

ఎఫ్‌సీ (ఫిట్‌నెస్ సర్టిఫికెట్) సేవలను రాయచోటికి పరిమితం చేయకుండా మదనపల్లిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు.

మహిళలకు ‘శ్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం స్వాగతించదగిన విషయమేనని, అయితే దీనివల్ల ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *