కుష్ఠు వ్యాధి గుర్తింపుకు సర్వే

సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే*

మదనపల్లి, సెప్టెంబర్ 07: జిల్లాలో సెప్టెంబర్ 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధి గుర్తింపుకు ఇంటింటా సర్వేకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ భవన్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాము” అనే లక్ష్యంతో రెండు వారాల పాటు జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సర్వేకు పూర్తి సహకరించి, శరీరంపై స్పర్శ తెలియని అనుమానాస్పద మచ్చలు ఉంటే సర్వే బృందానికి తెలియజేసి పరీక్షలు చేయించు కోవాలని కోరారు.

సర్వేలో ఆశా కార్యకర్తలు, ఎంపిక చేసిన పురుష ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శించి కుటుంబ సభ్యులను పరీక్షిస్తారని తెలిపారు. అనుమానిత కేసులను గుర్తించి పీహెచ్‌సీ వైద్య బృందం ద్వారా మరోసారి పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే ఎండీటీ (బహుళ ఔషధ చికిత్స) అందిస్తారని చెప్పారు.

కుష్ఠు వ్యాధికి పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం అని, తొలిదశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక, డీపీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, డీఎన్‌ఎంఓ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఎంపీహెచ్‌ఈఓ సుధాకర్ రాజు, డీఈఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *