స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పారదర్శకత పాటించాలి: వి.ఎస్. రెడ్డి

మదనపల్లె, జూలై 29: (gtvmedia)భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితా, ASDD (Absent, Shifted, Deletion, Death) ఓటర్ల పూర్తి వివరాలను రాజకీయ పార్టీలకు వెంటనే అందుబాటులో ఉంచాలని కోరింది.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమీక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ సూచనల మేరకు పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు రెండు వినతిపత్రాలను సమర్పించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ASDD ఓటర్ల పూర్తి వివరాలను తక్షణమే రాజకీయ పార్టీలకు అందించాలని, అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు.

ఇప్పటికే 2026 జూలై 25 నాటికి ASDD జాబితాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, సంబంధిత సమాచారాన్ని రాజకీయ పార్టీలకు అందించకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల పరిశీలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడాలంటే ప్రతి దశలో పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైందని, ప్రతి ఓటు విలువైనదని అన్నారు. ASDD జాబితాలు, ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచితేనే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో వ్యవహరించాలని కోరారు.

వినతిపత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్, సంబంధిత ఎన్నికల అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లె పట్టణ బూత్ కమిటీ అధ్యక్షుడు ఎన్. నవాజ్ అలీ ఖాన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *