దేవదాయ భూముల అన్యాక్రాంతంపై బహుజన యువసేన ఆగ్రహం

సీటీఎం, నిమ్మనపల్లెలో గుర్తించిన భూముల వివరాలు వెల్లడించాలి : పునీత్ కుమార్

మదనపల్లె: సెప్టెంబర్:7అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌ పరిధిలో దేవుడి మాన్యాలు, దేవదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయనే ఆరోపణలపై బహుజన యువసేన ఆందోళన వ్యక్తం చేసింది. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన దేవదాయ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్తున్నాయనే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరింది.

ఈ మేరకు బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ నేతృత్వంలో ప్రతినిధులు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దేవదాయ భూముల పరిరక్షణకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సీటీఎం, నిమ్మనపల్లె భూముల వివరాలు ఇవ్వాలి

ఇటీవల సీటీఎం (CTM), నిమ్మనపల్లె ప్రాంతాల్లో కొన్ని దేవదాయ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తమ దృష్టికి వచ్చిందని బహుజన యువసేన పేర్కొంది.

అలా గుర్తించిన భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, ఆక్రమణకు సంబంధించిన వివరాలు, సంబంధిత వ్యక్తుల వివరాలు తదితర పూర్తి సమాచారాన్ని అందజేయాలని దేవదాయ శాఖ అధికారులను కోరింది.

అవసరమైతే సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా కూడా వివరాలను సేకరించి దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు చేపడతామని బహుజన యువసేన నాయకులు తెలిపారు. దేవుడి మాన్యాలు, దేవదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *