మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.

కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల కమిటీతో నిర్వహించిన సమీక్షలో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఆపరేషన్ వజ్ర’ కింద తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పాఠశాలల పరిధిలో 100 మీటర్లలోపు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన నిఘా పెట్టాలని, విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. జనవరి 26 నుంచి ఇప్పటివరకు 7 కేసుల్లో 206 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 26 మందిని అరెస్టు చేశామని తెలిపారు. గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం, అవసరమైన సందర్భాల్లో పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పోలీసు, విద్యాశాఖల సమన్వయంతో ఈగల్ క్లబ్స్ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రతినెల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలను కోరారు.
