యూటీఎఫ్ బైక్ ర్యాలీ విజయవంతం

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు రాయితీలు లేని స్పెషల్‌ టెట్‌ వద్దు

40 శాతం అర్హత మార్కులతో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలి

సెప్టెంబర్‌ 3న ఛలో విజయవాడ: యూటీఎఫ్‌ నేతలు

మదనపల్లె, ఆగస్టు 26: (gtvmedia)ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ఎలాంటి రాయితీలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్‌ టెట్‌తో ప్రయోజనం లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్. జాబిర్‌, అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. చంద్రశేఖర్‌, కె. హేమలత అన్నారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్పెషల్‌ టెట్‌ విధానాన్ని నిరసిస్తూ బుధవారం చేపట్టిన బైక్‌ ర్యాలీ విజయవంతమైంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ప్రారంభమైన ర్యాలీ మదనపల్లె, వాయల్పాడు మీదుగా పీలేరు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, యూటీఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

40 శాతం అర్హత మార్కులు ఉండాలి

ఈ సందర్భంగా యూటీఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ.. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులతో, ఆఫ్‌లైన్‌ విధానంలో టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. పాత విధానాన్నే కొనసాగిస్తూ స్పెషల్‌ టెట్‌ పేరుతో నోటిఫికేషన్‌ జారీ చేయడం సమంజసం కాదన్నారు.

ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యాహక్కు చట్టాన్ని రూపొందించిందని తెలిపారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23(1)కు సంబంధించిన నిబంధనల ఆధారంగా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు కూడా టెట్‌ అర్హతను వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

అయితే ఆ తీర్పును సాకుగా చూపి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని నిబంధనలు విధించడం సరికాదని అన్నారు. విద్యాహక్కు చట్టం–2010లోని సెక్షన్‌ 23(1)కు అవసరమైన సవరణలు చేసి ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించేలా పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సిలబస్‌కు మించి ప్రశ్నల స్థాయి

టెట్‌ పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల స్థాయి నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ కంటే ఎక్కువగా, అత్యంత కఠినంగా ఉంటోందని యూటీఎఫ్‌ నాయకులు ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ, సంఘాలు కోరిన రాయితీల్లో ఒక్కటీ కల్పించలేదని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. స్పెషల్‌ టెట్‌లో 40 శాతం అర్హత మార్కులను ప్రవేశపెట్టి, పరీక్షను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే సెప్టెంబర్‌ 3న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు రవిప్రకాష్‌, శ్రీలత, జిల్లా కార్యదర్శులు విజయకుమార్‌, పురం వెంకటరమణ, సహదేవయ్య, శ్రీనివాసులు, నాగభూషణం నాయుడు, విజయ్‌కుమార్‌, ఈ. సుధాకర్‌, అంజాద్‌, నీలేష్‌తో పాటు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *