మదనపల్లె, ఆగస్టు 25: (gtvmedia)విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించే SLAS (State Learning Achievement Survey) పరీక్షపై మండల విద్యాశాఖాధికారులు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
మదనపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాకు చెందిన 25 మంది మండల విద్యాశాఖాధికారులు, 305 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్ SLAS పరీక్ష నిర్వహణ, విధి విధానాలు, సంబంధిత అంశాలను పాల్గొన్న వారికి సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేయడమే SLAS ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 5వ, 7వ, 9వ తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లీష్, తెలుగు మూడు సబ్జెక్టుల్లో వారి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాలను గుర్తించి, అభ్యసన లోపాలను విశ్లేషించడం ద్వారా భవిష్యత్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు SLAS ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష APC అనురాధ, DCEB సెక్రెటరీ తాటిపర్తి గంగాధర్, AMO అబ్దుల్ నాదిర్ షావలి, మండల విద్యాశాఖాధికారులు విజయనరాజు, నటరాజ రెడ్డి, కేశవ రెడ్డి, విజయకుమారి, రెడ్డిశేఖర్, మునీంద్ర నాయక్, బాలాజీ నాయక్, ద్వారకానాథ్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
