కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె, ఆగస్టు 18: (gtvmedia )జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో వ్యవసాయం, ఉద్యాన పంటలు, సూక్ష్మ నీటిపారుదల, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, సహకార శాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, లోటు వర్షపాతం ప్రభావం, ఈ-క్రాప్ నమోదు, పంటల బీమా, ఉద్యాన పంటల సాగు తదితర అంశాలను సమీక్షించారు.

5,005 హెక్టార్లలోనే పంటల సాగు

జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 40,455 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు సుమారు 5,005 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గత పది రోజులుగా వర్షపాతం లేకపోవడంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన విత్తనాలు, వ్యవసాయ ఇన్‌పుట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పంటల పరిస్థితిపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

పంటల బీమా నమోదుపై దృష్టి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1,781 మంది రైతులు, ఇతర బీమా పథకాల కింద 19,021 మంది రైతులు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బీమా నమోదు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఉద్యాన పంటల సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1.35 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుతం సుమారు 1.30 లక్షల ఎకరాల్లో సాగు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 33 వేల ఎకరాల మేర లోటు ఉన్నట్లు వివరించారు.

ముఖ్యంగా టమాటా, ఇతర కూరగాయలు, పూల పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగుపై పడుతున్న ప్రభావాన్ని నిరంతరం అంచనా వేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ-క్రాప్ నమోదు వేగవంతం చేయాలి

రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంలో ఈ-క్రాప్ నమోదు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ-క్రాప్ నమోదును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు.

పంటల వాస్తవ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా డేటాను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు

కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రస్తుతం నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలు, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న గ్రామాలు, బోర్ల పరిస్థితి, బోర్ల లోతు పెంచడం, మోటార్లను లోతుకు దించడం, నీటి వనరుల రీఛార్జ్ వంటి అంశాలపై సమీక్షించారు.

బోర్లు, పంప్‌సెట్లు ఎక్కడైనా మరమ్మతులకు గురైతే వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో నీటి రవాణా, ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగం వంటి చర్యలను ముందుగానే చేపట్టాలని ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.

సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *