నిబంధనలు అతిక్రమించి నిర్వహిస్తున్న బార్‌పై చర్యలు

ఫిర్యాదులపై నరసింహ బార్‌ను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

మదనపల్లి, ఆగస్టు 19: (gtvmedia)మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహిస్తున్న నరసింహ బార్ అండ్ రెస్టారెంట్ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోందని ఆరోపిస్తూ పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్‌తో పాటు అనిల్ కుమార్, తేజ వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు.

ఫిర్యాదులపై స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు నరసింహ బార్ అండ్ రెస్టారెంట్‌ను తనిఖీ చేసి, పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు బార్‌కు సమీపంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రితో ఉన్న దూరాన్ని కొలిచినట్లు తెలిపారు.

అధికారుల కొలతల్లో ఆసుపత్రి వెనుక వైపు నుంచి బార్‌కు సుమారు 72 మీటర్ల దూరం ఉన్నట్లు ఫిర్యాదుదారుడు పునీత్ కుమార్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం బార్‌లు, రెస్టారెంట్లు ఆసుపత్రులు, విద్యా సంస్థలకు నిర్దేశించిన కనీస దూరాన్ని పాటించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

కేవలం 72 మీటర్ల దూరంలోనే బార్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు, రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పునీత్ ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనపై సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత బార్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ప్రజల ఆరోగ్యం, విద్యార్థులు, రోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బార్‌లపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *