కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్

మదనపల్లె, ఆగస్టు 25: (gtvmedia)కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలందించిన కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు మంగళవారం శాంతియుత నిరసన చేపట్టారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని కోరారు. అలాగే కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

తమ సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు శాంతియుత ధర్నాలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో దయాకర్, రమణ, సుహాసిని, రిజ్వానా, మధుప్రియ, ఎస్తేర్ రాణితో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *