కలికిరిలో రూ.26 కోట్లతో సీఆర్పీఎఫ్‌ భవనాలు ప్రారంభం

జవాన్ల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం: బండి సంజయ్‌

కలికిరి, ఆగస్టు 17: దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల సేవలు అమోఘమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ అన్నారు. దేశ భద్రత కోసం 24 గంటలూ విధులు నిర్వహిస్తున్న జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను బండి సంజయ్‌ సోమవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇందులో ఆఫీసర్స్‌ మెస్‌, సబార్డినేట్‌ ఆఫీసర్స్‌ మెస్‌, రిక్రియేషన్‌ క్లబ్‌, స్టోర్‌ బ్లాక్‌, ట్రేడ్స్‌మెన్‌ బ్లాక్‌ ఉన్నాయి.

కఠినమైన విధులు నిర్వహించే జవాన్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ భవనాల ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రిక్రియేషన్‌ క్లబ్‌ ద్వారా జవాన్లు విధుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మార్గదర్శకత్వంలో సీఆర్పీఎఫ్‌ సహా కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఆధునీకరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని బండి సంజయ్‌ చెప్పారు. జవాన్లతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కార్యక్రమానికి సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *