విద్యార్థుల సమస్యలపై ఆగస్టు 20న సమరభేరి

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఏఐఎస్ఎఫ్

మదనపల్లి, ఆగస్టు 17: విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె. మాధవ్ విమర్శించారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఆగస్టు 20న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మదనపల్లిలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆగస్టు 20న నిర్వహించనున్న నిరసన ర్యాలీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ, పీపీపీ విధానాల వైపు తీసుకెళ్లే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అన్నమయ్య జిల్లాలో ఉన్నత విద్యా సౌకర్యాలను మెరుగుపరచాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని మాధవ్ కోరారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే అన్నమయ్య జిల్లా నుంచి విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 20న జరిగే నిరసన ర్యాలీకి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *