హార్సిలీ హిల్స్‌లో కూటమి నేతల కీలక భేటీ

స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన.. ఆరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష

హార్సిలీ హిల్స్, అక్టోబర్ 15: అన్నమయ్య జిల్లాలో జరగనున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు ఎన్నికల కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్‌లో గురువారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ జోనల్ ఇన్‌చార్జి దామచర్ల సత్య పాల్గొన్నారు.

ఆరు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు హాజరై నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు, రిజర్వేషన్ల అంశాలు, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం, ఎన్నికల కార్యాచరణను రూపొందించడం వంటి అంశాలపై సమీక్షించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నాయకులకు సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిస్థితులను సమీక్షిస్తూ, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో ఎన్నికల ప్రణాళికను అమలు చేయడంపై దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో కూటమి నాయకత్వం నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *