మదనపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పిలుపునిచ్చారు.
మదనపల్లెలోని టీడీపీ కార్యాలయంలో నేడు నిమ్మనపల్లి మండల పార్టీ నాయకులతో ఎమ్మెల్యే షాజహాన్ భాషా కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. నిమ్మనపల్లి మండలంలో స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాలు, 10 సర్పంచ్ స్థానాలు, ఒక ఎంపీపీ స్థానం, ఒక జెడ్పీటీసీ స్థానంలో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, ఎన్నికల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో నిరంతర ప్రజాసంబంధాలు ఎన్నికల్లో కీలకమని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

