నిసార్ అహమ్మద్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్జే. వెంకటేష్ మండిపాటు
మదనపల్లె, ఆగస్టు 22: (gtvmedia)మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్జే. వెంకటేష్ వైసీపీ నేత నిసార్ అహమ్మద్‌కు సూచించారు. 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇప్పుడు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
శనివారం నిమ్మనపల్లె సర్కిల్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే. వెంకటేష్‌తో పాటు శివకృష్ణ, రాజన్న, లోకేష్, రాంబాబు, ప్రకాష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్జే. వెంకటేష్ మాట్లాడుతూ.. మదనపల్లె పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చిప్పిలి, గుట్టకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. 2006లోనే రూ.20 కోట్లు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌కు సంబంధించిన పనుల్లో కేవలం స్పిల్‌వే పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యంగా 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులకు ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని నిసార్ అహమ్మద్‌ను ప్రశ్నించారు.
అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పైప్‌లైన్ పనుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆర్జే. వెంకటేష్ ఆరోపించారు. ట్యాంక్ నిర్మాణం పూర్తికాకముందే పైప్‌లైన్ పనులు చేపట్టడం వెనుక ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసమే భారీగా పైపులు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
అలాగే ఎంపీ నిధులతో చిప్పిలికి నీరు చేరేలా కాకుండా కేవలం రిటైనింగ్ వాల్ నిర్మించారని ఆయన విమర్శించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండినప్పుడు బ్యాక్‌వాటర్ వ్యవసాయ భూముల్లోకి రాకుండా మరవలు తొలగించిన ఘటన కూడా గత పాలకుల హయాంలో జరిగిందని ఆరోపించారు.
“వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. మీరు పర్సంటేజీలు తీసుకోలేదనే నమ్మకం మాకుంది” అంటూ ఆర్జే. వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఇకనైనా విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
సుమారు రెండు లక్షల జనాభా కలిగిన మదనపల్లె పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆర్జే. వెంకటేష్ తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నీటి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
