ఎస్‌సీ వర్గీకరణ పేరిట దళితులపై కుట్రలు: డాక్టర్ రత్నాకర్

దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

మదనపల్లె: gtvmedia
ఎస్‌సీ వర్గీకరణ పేరిట దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ ఆరోపించారు. ఆదివారం మదనపల్లెలో మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ ఎస్‌సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు.

గతంలో మాల మహానాడు కార్యకలాపాలు రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉండేవని, అయితే ఎస్‌సీ వర్గీకరణ అంశం దేశవ్యాప్త సమస్యగా మారడంతో సంస్థను రాక్స్ మాల మహానాడుగా విస్తరించినట్లు రత్నాకర్ వివరించారు. ఉద్యమంలో భాగంగా ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పర్యటించి సుమారు 360కి పైగా ప్రెస్‌మీట్లు నిర్వహించినట్లు తెలిపారు.

ఎస్‌సీ రిజర్వేషన్ల ద్వారా కేవలం ఒకటి లేదా రెండు శాతం మందికే ప్రయోజనం కలుగుతోందని, మిగిలిన 99 శాతం మంది దళితులు ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎస్‌సీ జాబితాలో ఉన్న 59 కులాలకు వర్గీకరణ ద్వారా ప్రయోజనాలను సమానంగా పంచడం సాధ్యమా అని ప్రశ్నించారు.

సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు తమ కేబినెట్ పదవుల విషయంలో లేదా ముఖ్యమంత్రి పదవిలో సామాజిక న్యాయాన్ని అమలు చేయగలరా అని రత్నాకర్ సవాల్ చేశారు.

న్యాయస్థానాల తీర్పులు కాలానుగుణంగా మారుతుంటాయని, గతంలో సాధ్యం కాదని పేర్కొన్న ఎస్‌సీ వర్గీకరణకు ప్రస్తుతం అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత పోరాటం ద్వారా తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

దేశంలోని దళిత ప్రజాస్వామ్యవాదులు, సంఘ సంస్కర్తలు ఎస్‌సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏకమై పోరాడాలని డాక్టర్ రత్నాకర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎం. నరేష్, ఎ. భాస్కర్, ఇ. రమణ, కనికెళ్ల నాని, ఎంపీ ఆనంద్, ఎం. మోహన్, డీకే నారాయణ, కె. వెంకట రమణ, కె. లక్ష్మీపతి, కేశవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *