జేసీ శివనారాయణశర్మకు వినతిపత్రం అందజేసిన ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు
మదనపల్లె,సెప్టెంబర్ 12 : జిల్లాలోని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లా సచివాలయాల ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు ఏఏఎస్ను వెంటనే మంజూరు చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లను ప్రకటించాలని కోరారు. గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఉద్యోగులకు సంబంధించిన 7 సంవత్సరాల సరెండర్ లీవులకు నగదు చెల్లించాలని, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ను ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జేసీకి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఏపీ సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు KSK వెస్లీతో పాటు అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
