సోమల, ఆగస్టు 18:( gtvmudia)శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం పుంగనూరు నియోజకవర్గంలోని సోమల పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, రౌడీ షీటర్లకు సంబంధించిన రికార్డులను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘాను మరింత విస్తరించాలని, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అనంతరం పోలీస్ సిబ్బంది యోగక్షేమాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింత పెంచాలని సూచించారు.
ఈ తనిఖీలో చౌడేపల్లి సీఐ పి. సాయిప్రసాద్, సోమల ఎస్‌ఐ ఎన్. రమేష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
