రెన్యువల్ చేసుకోకుంటే మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు

ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు.. క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి: ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు

మదనపల్లె: మద్యం దుకాణాల లైసెన్సులను నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేసుకోకుంటే లైసెన్సులు రద్దు అవుతాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు స్పష్టం చేశారు. మదనపల్లె ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మదనపల్లె, ములకలచెరువు, వాల్మీకిపురం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాల లైసెన్సీదారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ జయరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులను ఏడాది కాలానికి రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాత లైసెన్స్ ఫీజుకు అదనంగా నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి ఏడాది కాలానికి లైసెన్సులను పునరుద్ధరించుకోవాలని సూచించారు.

మద్యం విక్రయాల్లో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించడంతో పాటు, ప్రతి మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి విక్రయాలు జరపాలని సూచించారు.

ఈసారి ఏఐ విధానం ద్వారా ప్రతి మద్యం దుకాణాన్ని అనుసంధానం చేయనున్నందున, దుకాణాల నిర్వహణలో సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని లైసెన్సీదారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సీఐలు భీమలింగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *