భవిష్యత్ ఉద్యోగాలకు ఏఐ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్, డేటా విశ్లేషణపై పట్టు అవసరం: శ్రీకాంత్
మదనపల్లె:సెప్టెంబర్ 11
మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం ఎంబీఏ విద్యార్థుల ఇండక్షన్ కార్యక్రమంలో భాగంగా “నెక్స్ట్ జనరేషన్ ఎంబీఏ కెరీర్స్: హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.


కార్యక్రమానికి తిరుపతికి చెందిన ఇన్నోవేటివ్ అకాడమీ ఫర్ ఐటీ సొల్యూషన్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆధునిక హెచ్‌ఆర్ ఉద్యోగ అవకాశాలు, ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తున్న మార్పులు, పరిశ్రమ అవసరాలు, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎంబీఏ విద్యార్థులు తరగతి గదిలో పుస్తకాల ద్వారా పొందే పరిజ్ఞానంతో పాటు ఆఫ్‌లైన్ ఇంటర్న్‌షిప్‌ల ద్వారా సంస్థల్లో ప్రత్యక్షంగా పనిచేసి ఆచరణాత్మక అనుభవాన్ని పొందాలని సూచించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా టీమ్ వర్క్, సమయ నిర్వహణ, ప్రణాళిక, కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, నాయకత్వ లక్షణాలతో పాటు సంస్థల పని విధానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం హెచ్‌ఆర్ రంగం కేవలం ఉద్యోగుల నియామకానికే పరిమితం కాకుండా ప్రతిభ గుర్తింపు, ఉద్యోగుల శిక్షణ, పనితీరు నిర్వహణ, హెచ్‌ఆర్ డేటా విశ్లేషణ వంటి విభాగాలకు విస్తరిస్తోందన్నారు. అదే విధంగా ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్‌లో కంటెంట్ తయారీ, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రకటనలు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మార్కెటింగ్ ఆటోమేషన్, వినియోగదారుల సమాచార విశ్లేషణకు ప్రాధాన్యత పెరుగుతోందని వివరించారు.
భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు ఏఐ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, డేటా విశ్లేషణ, టీమ్ వర్క్, సమయ నిర్వహణ, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
తరగతి గది నుంచి పరిశ్రమకు విద్యార్థులను సిద్ధం చేయడంలో ఇంటర్న్‌షిప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, ఇంటర్న్‌షిప్‌ను కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా వాస్తవ ప్రాజెక్టులు, సంస్థాగత అనుభవం, వృత్తిపరమైన నైపుణ్యాలను పొందేందుకు ఉపయోగించుకోవాలని శ్రీకాంత్ సూచించారు.
కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, డాక్టర్ గంగిశెట్టి, కోఆర్డినేటర్లు డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, డాక్టర్ కే. శిరీషతో పాటు ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.
