మిట్స్‌ యూనివర్సిటీలో జపాన్‌లో ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు

మదనపల్లె,సెప్టెంబర్ 22:మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో విద్యార్థులకు జపాన్‌లో ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, అంతర్జాతీయ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించే సదస్సు నిర్వహించారు.

మిట్స్‌ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగం, ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో “జపాన్‌లో కెరీర్ అవకాశాలు – సంస్కృతి, సంప్రదాయాలు మరియు భాష” అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జపాన్‌కు చెందిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్, బెంగళూరులోని మోజాయిక్ ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ, వ్యవస్థాపకుడు హిరోయుకి ఇషిద పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ కెరీర్‌ను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన పని సంస్కృతి వంటి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్ క్రమశిక్షణ, సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందిన తీరును విద్యార్థులకు వివరించారు.

జపాన్‌లో వివిధ రంగాల్లో అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా జపనీస్ భాషపై ప్రావీణ్యం సాధించడం ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు కెరీర్ అభివృద్ధికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు.

విద్యార్థులకు జపాన్ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు సంప్రదాయ కటానా టెక్నిక్స్ ప్రదర్శనతో పాటు కిమోనో ధరించే విధానాన్ని కూడా ప్రదర్శించారు.

జపనీస్ భాషా బోధకురాలు మోహనా దాస్ మాట్లాడుతూ జపనీస్ భాషా ప్రావీణ్యాన్ని అంచనా వేసే పరీక్షలోని వివిధ స్థాయులు, వాటి ప్రాధాన్యతను వివరించారు. కేవలం ధ్రువపత్రాలు పొందడానికే పరిమితం కాకుండా, రోజువారీ సంభాషణల్లో జపనీస్ భాషను సమర్థవంతంగా ఉపయోగించే నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు.

మిట్స్ ప్రిన్సిపాల్ డా. పి. రామనాథన్ మాట్లాడుతూ మిట్స్‌లో నిర్వహిస్తున్న జపనీస్ భాషా శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. విద్యార్థులు జపాన్‌లో ఇంటర్న్‌షిప్‌లు, ఉన్నత విద్య, అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

కార్యక్రమంలో ప్రొఫెసర్ పి.ఎం. బాలాజీ, అసిస్టెంట్ డైరెక్టర్–ఇండస్ట్రీ రిలేషన్స్, యు. విజయలక్ష్మి, అసోసియేట్ డైరెక్టర్–ఇంటర్నేషనల్ రిలేషన్స్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. బాస్కరన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *