మిట్స్‌లో బీటెక్ విద్యార్థులకు అతిథి ఉపన్యాసం

కోడింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు AI వినియోగంపై అవగాహన కల్పించిన అమెజాన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్

మదనపల్లె, సెప్టెంబర్ 2: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులకు అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థిని, ప్రస్తుతం బెంగళూరులోని అమెజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న టి.ఆర్. దీక్షిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దీక్షిత మాట్లాడుతూ.. మిట్స్‌లో మొదటి సంవత్సరం విద్యార్థినిగా ప్రారంభమైన తన ప్రయాణంలో అధ్యాపకుల మార్గదర్శకత్వం, సంస్థ అందించిన సహకారం, నిరంతర కృషి, పట్టుదల తన విజయానికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. వివిధ దశల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రస్తుతం అమెజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా రూ.29 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఎంపికై పనిచేస్తున్నట్లు వివరించారు.

అమెజాన్ ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో ఎదురైన వివిధ ఇంటర్వ్యూ రౌండ్లు, అడిగిన ప్రశ్నల స్వభావం, వాటికి సమర్థవంతంగా సమాధానం చెప్పే విధానాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తొలి సంవత్సరం నుంచే కోడింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌వర్క్ వంటి సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

అలాగే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. అయితే AIపై పూర్తిగా ఆధారపడకుండా స్వంత ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు.

విద్యార్థులు సరైన సమయంలో ఇంటర్న్‌షిప్‌లు చేపట్టాలని, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ అందిస్తున్న విద్యా, సాంకేతిక, కెరీర్ అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని దీక్షిత సూచించారు.

ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ డి. జగదీశ్ బాబు, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగాశ్వేత, అల్యూమిని కోఆర్డినేటర్ వి. గీతతో పాటు మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *