— యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల స్పష్టం
మదనపల్లె, సెప్టెంబర్ 2:
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని మదనపల్లె దొంతివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ సూచన మేరకు అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బి. శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అండతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్సార్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆయన అండగా నిలిచారని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా, ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బి. శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్. గుల్షన్, ఏపీసీసీ మైనార్టీ ఉపాధ్యక్షులు బి. మహమ్మద్ షరీఫ్, మదనపల్లె పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్, విశ్రాంత ఎంఈఓ బి. ఈశ్వరయ్య, జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు సోమశేఖర్, పట్టణ మహిళా మాజీ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, నిమ్మనపల్లె మండల బీసీ సెల్ మాజీ అధ్యక్షులు నాగరాజు, మదనపల్లె రూరల్ మండల యువ నాయకులు జీవన్ తదితరులు పాల్గొన్నారు.
