నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంఘం సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లె, సెప్టెంబర్ 6: విద్యతో పాటు రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకుంటే నూర్ భాషా దూదేకుల సామాజిక వర్గం ఉన్నత శిఖరాలను చేరుకోగలదని మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పేర్కొన్నారు.

ఆదివారం మదనపల్లి పట్టణంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్, జిల్లా అధ్యక్షులు షకీల్ అహ్మద్, ఇందాదుల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి నూర్ భాషా దూదేకుల సంఘం ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దూదేకుల సంఘం అధ్యక్షులు పీర్ మహమ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల జనాభా 40 లక్షలకు పైగా ఉండగా, అందులో సుమారు 12 లక్షల మంది నూర్ భాషా దూదేకుల సామాజిక వర్గానికి చెందినవారున్నారని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో నూర్ భాషా దూదేకులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నూర్ భాషా దూదేకుల సామాజిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు. విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, యువత రాజకీయంగా చైతన్యవంతమై రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని సూచించారు.
దూదేకుల సామాజిక వర్గానికి చెందిన ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు.
ఈ కార్యక్రమంలో రెడ్డిభూ తదితరులు పాల్గొన్నారు.
