ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పరిశ్రమల అవసరాలపై విద్యార్థులకు అవగాహన
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు–2026 ఘనంగా ప్రారంభమైంది. సివిల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘సీటా–2కే26 (CITA–2K26)’, ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఎక్లిటికా (ECLECTIKA–2K26)’, ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ‘టెరా (TERA–2K26)’, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘మెకానాన్స్ (MECHONANCE–2K26)’ పేరిట ప్రత్యేక సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించారు. వీటి ద్వారా విద్యార్థులకు ఆయా ఇంజినీరింగ్ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెంగళూరుకు చెందిన ఏసీఈ డిజైనర్స్ లిమిటెడ్ సంస్థ వీఏఎస్ అండ్ ప్రొడక్ట్స్ అప్లికేషన్స్ హెడ్ కాశీనాథ్ పట్నశెట్టి, హంద్రీ–నీవా సుజల స్రవంతి సూపరింటెండింగ్ ఇంజినీర్ రాయళ్ల విఠల్ ప్రసాద్, ఐఐటీ ఢిల్లీకి చెందిన SeNSE విభాగం ఫ్యాకల్టీ సభ్యులు, ఇంట్రిన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతోష్ శివసుబ్రమణి పాల్గొన్నారు. ముఖ్య అతిథులు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, విభాగాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాశీనాథ్ పట్నశెట్టి మాట్లాడుతూ భారతీయ తయారీ పరిశ్రమల్లో ప్రస్తుత సాంకేతిక ధోరణులు, స్థిరమైన సేవలు, ఒక ఆలోచనను ఆచరణాత్మక ఉత్పత్తిగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకెళ్లే విధానాలను వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనా విధానం, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రొఫెసర్ సంతోష్ శివసుబ్రమణి మాట్లాడుతూ భవిష్యత్తులో కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అభివృద్ధి చెందనున్న ఆధునిక కంప్యూటింగ్ సాంకేతికతలు, వాటి అనువర్తనాలను వివరించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ భారతదేశంలో ఈ రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పరిశోధనలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థల స్థాపన, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా బలమైన సాంకేతిక వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.



రాయళ్ల విఠల్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా సివిల్ ఇంజినీరింగ్లో సర్వేయింగ్, ఎస్టిమేషన్ వంటి అంశాలు నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తరగతి గదుల్లో నేర్చుకున్న సాంకేతిక అంశాలను వాస్తవ ప్రాజెక్టుల్లో అన్వయించుకోవడం ద్వారా విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలను సాధించగలరని వివరించారు.
రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన మార్పులపై అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతులు డాక్టర్ సంజయ్ కుమార్ సి. గోరె, డాక్టర్ విజయ్ కుమార్ నటేశన్, డాక్టర్ భాస్కరన్, డాక్టర్ మనవాళన్ గుణశేఖరన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
